No title

MoovieStars
0
జొన్న రొట్టె ఆరోగ్యాన్ని పెంచుతుందని తెలుసు. అదే జొన్న రొట్టెలు కాసులు కురిపిస్తాయని నిరూపిస్తోంది ఓ కుటుంబం. దేశీయ రుచిని ఎల్లలు దాటించి.. విదేశీయులను సైతం కస్టమర్లుగా మార్చుకుని వహ్వా అనిపించింది.

విదేశాలకు ఎగుమతి అవుతున్న ఈ జొన్న రొట్టెల కేరాఫ్‌ అడ్రస్‌ కర్ణాటకలోని హుబ్లీ. వీటిని తయారు చేస్తున్న లింగన్‌ గౌడ గతంలో ఇక్కడే చిన్న మెస్‌ నడిపేవాడు. భార్య పుష్ప, కొడుకు గిరీశ్‌ ఆయనకు చేదోడువాదోడుగా ఉండేవారు. మెనూలో జొన్నరొట్టెలను ఎంటర్‌ చేయడంతో లింగన్‌ గౌడ దశ, దిశ మారిపోయాయి. ఒక్కసారి జొన్నరొట్టె టేస్ట్‌ చేసిన కస్టమర్లు ప్రతి రోజూ అదే ఆర్డర్‌ చేయడం మొదలుపెట్టారు. ఒక్కో రొట్టె ఖరీదు మూడురూపాయల యాభైపైసలు మాత్రమే. దీంతో అనతి కాలంలోనే తక్కువ ధరలో లభిస్తున్న ఈ మన్నికైన రుచి హుబ్లీ అంతా పాకింది. కట్‌ చేస్తే.. హుబ్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీరి రోటీలకు ఆదరణ పెరిగింది. ఆ డిమాండ్‌ను అందుకోవడానికి కేవలం జొన్నరొట్టెలు చేయడానికే లింగన్‌గౌడ ఇద్దరు మనుషులను ప్రత్యేకంగా నియమించాడు. రోజుకు యాభై, అరవై రొట్టెలతో మొదలైన వీరి ప్రస్థానం.. కొన్నాళ్లకే వెయ్యి రొట్టెలకు చేరింది.
డిమాండ్‌ పెరిగినా అదే రేటు..
తన వ్యాపారాన్ని మరింత పెంచాలనుకున్న లింగన్‌ గౌడ పూర్వ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ పేరుతో ఓ కంపెనీని మొదలుపెట్టాడు. నలభై మంది మహిళలకు ఉపాధి కల్పించాడు. భార్యకు సూపర్‌వైజింగ్‌ బాధ్యతలు అప్పగించాడు. ఉత్తర కర్ణాటక రీజియన్‌లో ఏజెంట్లను నియమించాడు. ప్రధాన పట్టణాల్లోని డీలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విస్తృతంగా ప్రచారం చేశాడు. రోజుకు పదివేల నుంచి పన్నెండు వేల వరకు జొన్న రొట్టెల ఆర్డర్లు వచ్చేవి. డిమాండ్‌ పెరిగినా ఖరీదు పెంచలేదు.. క్వాలిటీ తగ్గించలేదు. రొట్టెలు ఎక్కువ కాలం ఉండేందుకు కరకరలాడేలా చేసేవారు. రొట్టెల నాణ్యత తగ్గకుండా పక్కాగా ప్యాకింగ్‌ ఉండేది. దీంతో ఆయన వ్యాపారం మూడు ఆర్డర్లు.. ఆరు రొట్టెలుగా సాగిపోయింది. 
కడక్‌ రోటీ..
సొంత రాష్ట్రంలోని మనసులు గెలిచిన ఈ రొట్టెలు.. తర్వాతి కాలంలో పొరుగు రాష్ట్రా‌ల్లోనూ బిజినెస్‌ చేయడం మొదలుపెట్టాయి. కొందరు డీలర్లు ఇతర రాష్ట్రా‌లకు వీటిని పంపడం మొదలుపెట్టారు. జొన్నరొట్టెలు సహజంగా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. పైగా కడక్‌గా కాల్చడంతో ఈ రోటీలు నెలల పాటు నిల్వ ఉండేవి. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలకు ఎగుమతి అవుతున్నాయివి. ఇదే జోరులో విదేశాలకు కూడా హుబ్లీ మేడ్‌ రొట్టెలు.. రెక్కలు కట్టుకుని వెళ్లిపోయాయి. అసే్ట్రలియా, అమెరికా, దుబాయ్‌, యూకే.. ఇలా పలుదేశాల్లో ఈ జొన్నరొట్టెల అభిమానులు ఉన్నారు. ‘పలువురు డీలర్లు మా దగ్గర రొట్టెలు కొనుగోలు చేసి విదేశాలకు పంపిస్తున్నారు. విదేశాలకు మేమే నేరుగా ఎగుమతి చేసేందుకు లైసెన్స్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. అది రాగానే ఈ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేస్తాం. వంద రూపాయల మిగులుతో మొదలైన మా వ్యాపారం.. నేడు కోటి రూపాయల టర్నోవర్‌ సాధించడం ఆనందాన్నిస్తోంద’ని అంటారు లింగన్‌ గౌడ.
సీజన్‌లో యాభై టన్నులు..
‘మేం జొన్న రోటీలతో పాటు సజ్జ, రాగి రొట్టెలు కూడా చేస్తుంటాం. నెలకు 30-40 టన్నుల జొన్నపిండి అవసరం అవుతుంది. పెళ్లిళ్ల సీజన్‌లో మరో పది టన్నులు కావాల్సి వస్తుంది. రోటీ తయారీ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటాం. మా దగ్గర వర్కర్లు.. చేతులకు గ్లౌవ్స్‌, నెత్తిన క్యాప్‌ ధరిస్తారు. తయారీలో ఫిల్టర్‌ వాటర్‌ మాత్రమే వాడతాం’ అని తెలిపారు పుష్ప. మొత్తానికి కన్నడనాట తయారవుతున్న జవారీ రోటీలు.. విదేశాలకు ఎగుమతి అవుతూ అక్కడివారికి మేలైన రుచితో పాటు.. మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి.

Post a Comment

0Comments
Post a Comment (0)